నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో 'ధ్రుబే' అనే ఏనుగు పగబట్టి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు తీసింది. 2012 డిసెంబర్‌లో మాడి పట్టణంలో శనిచర బోటే తల్లిదండ్రులను చంపిన ఈ ఏనుగు, 14 ఏళ్ల తర్వాత ఈ నెల ఆరంభంలో జగత్‌పూర్‌లో అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటే, 4 ఏళ్ల మనవడు భరత్ బోటేలను అతి కిరాతకంగా హత్య చేసింది.
2012లో జరిగిన దాడితో భయపడిన శనిచర బోటే కుటుంబం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాప్తి నది దాటి 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు వలస వెళ్లింది. తమకు ఇక ఆ ఏనుగు నుంచి ప్రమాదం ఉండదని భావించిన వారిని, విధి వెక్కిరిస్తూ 'ధ్రుబే' వాసన పట్టి వెతుక్కుంటూ వచ్చి దాడి చేసింది. దీంతో పారిపోవడానికి చోటు లేదని, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏనుగు తమను వదలలేదని శనిచర కన్నీరుమున్నీరయ్యారు.
చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రతినిధి అభినాష్ థాపా మగర్ తెలిపిన వివరాల ప్రకారం, 2010 నుంచి ఇప్పటివరకు 'ధ్రుబే' ఏనుగు 25 మందిని చంపింది. తాజా ఘటనకు ముందు 23 మంది మరణించగా, జగత్‌పూర్ దాడితో ఈ సంఖ్య 25కు చేరింది. ఈ ఏనుగు భయానక చరిత్రకు నిదర్శనంగా వికీపీడియాలో కూడా దీనికి ప్రత్యేక పేజీ ఉంది.
అటవీ అధికారులు 2016 నుంచి 'ధ్రుబే' కదలికలను పర్యవేక్షిస్తున్నారు. దీనికి ట్రాకింగ్ కాలర్ అమర్చి, 2020, 2023లో మార్చినప్పటికీ, దానిని పూర్తిగా నియంత్రించడంలో విఫలమయ్యారు. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు విస్తరించడం వల్ల నేపాల్‌లో ఇలాంటి ఘర్షణలు పెరుగుతున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







