రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రమేశ్‌తో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీవో మరియు కలెక్టర్ కార్యాలయాల్లో వీరు గత 20 నుంచి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల రోజువారీ కార్యకలాపాల్లో 99 శాతం పనులు తమ వల్లే సాగుతున్నాయని, తమ సేవలు లేకుండా ఏ రిపోర్టులు సిద్ధం కావని ఉద్యోగులు పేర్కొన్నారు.
ప్రస్తుతం తొలగించబడిన వారిలో చాలామంది వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంది. ఇన్ని ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత, ఎటువంటి కారణం లేదా రిమార్క్ లేకుండానే తమను ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో బయట కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టమని, కనీసం కిరాణా షాపుల్లో సరుకులు కూడా అప్పుగా ఇవ్వడం లేదని రమేశ్ వాపోయారు.
మరోవైపు, 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక దివ్యాంగ ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేస్తారని ఆశించామని, కానీ ఇప్పుడు ఉద్యోగాలే లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. గత రెండేళ్లుగా జీతాలు కూడా సక్రమంగా అందలేదని, ఇప్పుడు ఉపాధి కోల్పోవడంతో తాము రోడ్డున పడ్డామని చెబుతూ, ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.








