హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్, అటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మధ్య ఊహించని విధంగా కోల్డ్ వార్ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు మధ్యలోనే బ్రేక్ పడిన సంఘటన వాడి, వేడి చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీలుగా సిద్దాంతాలు వేరైనా.. ప్రభుత్వాలుగా కలిసి పనిచేద్దామన్న రేవంత్ సర్కారు ధోరణికి విఘాతం కలగడంతో భారతీయ జనతా పార్టీ విధానం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా పార్టీలు, వాటి విధానాలు, లక్ష్యాలు ఏవైనప్పటికీ సామాజిక అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందు కోసం సమన్వయంతో పనిచేయాల్సిన పాలకుల మధ్య విభేదాలు తగవన్న వాదనకు బలం చేకూరుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజాగా తలెత్తిన ఈ విభేదాలు, రాజకీయ పరిణామాలు తెలంగాణాలో ఆ రెండు పార్టీ అభవిష్యత్తుకు కొలమానంగా మారుతున్నాయి. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి విరుచుకుపడిన ఘటనతో మరోసారి ‘కేంద్ర ప్రభుత్వ వివక్ష’ తెరపైకి వచ్చింది. నాడు ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్.. నేడు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు నోట ‘ఒకేమాట’ వినిపిస్తోంది. నాడు కేంద్ర హోమంత్రి హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా తెలంగాణాను పాకిస్తాన్‌తో పోల్చిన వ్యాఖ్యలను సీఎంగా కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇకపై ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సీఎంగా తాను ఆహ్వానం పలుకబోనని తెగేసి ప్రకటించిన తర్వాత ఎన్నిసార్లు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో కేసీఆర్ వాదనకు, విధానానికి రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపారు.
ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయం తెరపైకి వచ్చింది. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతున్న ప్రతి రూపాయి నుంచి తిరిగి 40 పైసలు మాత్రమే వస్తున్నాయని, అదే సందర్భంలో గుజరాత్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం దాదాపు రెండింతలు తిరిగి చెల్లిస్తోందని నాడు మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వ వివక్షను తెలంగాణ ప్రజలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో రాజకీయంగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నా.. వాటన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి కోసం ‘బాయీబాయీ’ అని ముందడుగు వేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు అండగా నిలిచే అవకాశాలు పెరుగుతున్నాయి. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. మోడీ దేశ ప్రధానమంత్రిగా ‘బడే బాయ్.. చోటే బాయ్’ అయితే, తప్పేమిటని ప్రశ్నించిన రేవంత్ విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ”అభివృద్ధి కోసం ఒక్కసారి కాదు.. వందసార్లు కలుస్తా..” అన్న రాజకీయ సవాళ్లకు అర్థం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భేషజాలకు పోకుండా అభివృద్ధికి సహకరించాలంటూ పదేపదే ఢిల్లీ వెళ్లి సీఎం హోదాలో చేసిన విజ్ఞప్తులు, కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనలపై భవిష్యత్తులో సానుకూలత ఉంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫెడరల్ స్పూర్తితో వ్యవహరిస్తున్న ప్రజా ప్రభుత్వానకి తోడ్పాడును అందిచాల్సిన మోడీ సర్కారు.. ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ విధానాన్ని అనుసరిస్తోందని మేధావులు మండిపడుతున్నారు. పురోగమిస్తున్న తెలంగాణాలో రాజకీయంగా ఎదిగే శక్తియుక్తులు లేకనే, అభివృద్ధి లక్ష్యాలకు ఇలాంటి అడ్డుపుల్లలు వేస్తున్నారన్న ఆరోపణలు సామాన్య ప్రజల నుంచి సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి విధానంతో సంస్థాగతంగా బీజేపీకి నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
”వైబ్రెంట్ గుజరాత్” నినాదంతో ప్రపంచ పెట్టుబడుల కోసం నాడు సీఎంగా, నేడు ప్రధానిగా నరేంద్రమోడీ అనేక దేశాల్లో పర్యటిస్తే.. కనిపించని రాజకీయ కోణం, దేశ అంతర్గత భద్రత అంశాలపై విశ్లేషకులు కేంద్ర ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సందిస్తున్నారు. గతంలో దశాబ్ధాల పాటు అన్ని రంగాల్లో వెనుకబాటుకు, వివక్షకు గురైన తెలంగాణాలో అభివృద్ధి సాధించేందుకు ”రైజింగ్ తెలంగాణ” నినాదంతో అవే లక్ష్యాలతో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తుంటే ఉద్దేశ పూర్వకంగా మోడీ సర్కారు అడ్డుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగైతే ప్రజా కోర్టులో బీజేపీ దోషిగా నిలబడక తప్పదన్న అభిప్రాయాన్ని తెలంగాణ మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
దేశ సార్వభౌమాధికారం, రాజ్యాంగ స్పూర్తిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ప్రతిపాదనపై కేంద్ర విదేశాంగశాఖ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే ఒక దేశంలో ఉండగా, మరో దేశానికి వెళ్లే అనుమతిని అర్ధాంతరంగా రద్దు చేయడం పట్ల రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పండితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అభ్యంతరాలుంటే ముందుగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్న నిబంధనను కేంద్రం ఉద్దేశపూర్వకంగా, రాజకీయ దురుద్దేశంతో ఉల్లంగించిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధిని ప్రోత్సహించి ప్రజల మన్ననలు పొందాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘రైజింగ్ తెలంగాణ’ కార్యాచరణను అడ్డుకోవడం వెనక కుట్ర కోణం దాగి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనతో అభ్యంతరాలతో పాటు సీఎం పర్యటనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని తెలంగాణ సమాజం రాష్ట్రానికి జరిగిన అవమానంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధిలో కలిసి సాగుదామన్న సీఎం సంకల్పానికి బ్రేక్ పడడంతో కారణం చెప్పకుండానే సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు అడ్డుకుంటారా? అని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలంతా బీజేపి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందని, తదనంతర పరిణామాలతో క్రమక్రమంగా బలపడుతూ గడిచిన ఎన్నికల్లో 8మంది ఎంపీలతో మద్దతిచ్చిన తెలంగాణాకు ద్రోహం జరుగుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార పార్టీ చేస్తున్న ఈ ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక భావం బలపడే అవకాశాలు పెరుగుతున్నాయి. అండగా నిలిచి 8 మంది ఎంపీలను గెలిపించి ఆదరించిన ప్రజల ప్రశ్నలకు జవాబేది? అన్న ప్రశ్నలను తెలంగాణ మేధావులు తెరపైకి తీసుకువస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఆరోపణల్లో తప్పేమీ లేదంటూ రాజకీయ పండితులు, మేధావులు కితాబిస్తున్నారు. అభివృద్ధి కోసం ఒకసారి కాదు.. వందసార్లు కలుస్తానన్న సీఎం వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషణలు జోరందుకున్నాయి.








