బెంగళూరులోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (CCH) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడిగా ఉన్న ప్రదోష్, ఇకపై అప్రూవర్‌గా అంటే నేరానికి సంబంధించిన నిజాలను వెల్లడించే సాక్షిగా వ్యవహరిస్తారని కోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రదోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.
అప్రూవర్‌గా మారిన ప్రదోష్, హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇతర నిందితుల పాత్ర వంటి వివరాలను నిజాయితీగా కోర్టుకు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు అతను కస్టడీలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అతను నిజాలు చెప్పడంలో విఫలమైతే లేదా షరతులను ఉల్లంఘిస్తే, అప్రూవర్ హోదాను కోల్పోయి మళ్లీ నిందితుడిగా మారే అవకాశం ఉంది.
ఈ పరిణామం ప్రాసిక్యూషన్ వాదనకు బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రదోష్ ఇచ్చే వాంగ్మూలం మాత్రమే తుది తీర్పుకు ఆధారం కాదు. కోర్టు అతని మాటలతో పాటు ఇతర సాక్ష్యాలు, పత్రాలు, ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
2024లో బెంగళూరులో రేణుకాస్వామి హత్య జరిగింది. నటుడు దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని చిత్రకూట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు. దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్న పవిత్ర గౌడను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఈ హత్య జరిగినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో దర్శన్‌కు కోర్టు మరో ఎదురుదెబ్బ ఇచ్చింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ అంటే సాక్షులను ఎదుటి పక్షం న్యాయవాదులు ప్రశ్నించే సమయంలో తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని దర్శన్ కోరగా, కోర్టు తిరస్కరించింది. ఇకపై దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణకు హాజరుపరచాలని కోర్టు స్పష్టం చేసింది.








