రంజీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 23.5 ఓవర్లు వేసి, 8 మెయిడిన్లు సహా కేవలం 37 పరుగులు ఇచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. 1.55 ఎకానమీతో షమీ బౌలింగ్ చేయడంతో మహారాష్ట్ర బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

షమీ బౌలింగ్‌లో పృథ్వీ షా 12 పరుగులకే వెనుదిరగగా, సిద్ధేశ్ వీర్, దిగ్విజయ్ పాటిల్, ప్రదీప్ ధాదేలు పెవిలియన్‌కు చేరారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బెంగాల్ జట్టు విజయం సాధించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 143 పరుగులకే కుప్పకూలగా, మహారాష్ట్ర 218 పరుగులు చేసి 75 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 186 పరుగులకు ఆలౌట్ కావడంతో, మహారాష్ట్ర ముందు 112 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. పృథ్వీ షా 53 పరుగులు, సచిన్ ధాస్ 61 పరుగులతో రాణించడంతో మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో బెంగాల్ జట్టు నిరాశపరిచింది.

ఈ సీజన్‌లో షమీ వరుసగా వికెట్లు తీస్తూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 5 వికెట్లు, కేరళతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి బెంగాల్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్‌లో షమీ చూపుతున్న ఈ ఫామ్ ఇప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీలో చర్చకు దారితీసింది.

షమీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తున్న షమీకి జట్టులో చోటు ఎప్పుడు దక్కుతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.