రామేశ్వరం మెట్టలో సుమారు 900 ఎకరాల భూమి ఉంది. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార వ్యవస్థ ద్వారా 492 మంది దళితులకు 579 ఎకరాల భూమిని జీడి మామిడి తోటల సాగు కోసం కేటాయించారు. అయితే, కాలక్రమేణా ఈ భూములు లీజు పేరుతో కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఇక్కడ జీడి తోటలు కనుమరుగై, మైనింగ్ కేంద్రాలుగా మారాయి.
ప్రస్తుతం ఈ మెట్ట నుంచి వందల లారీల్లో లక్షల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు మట్టిని తవ్వుకోవడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు దానికి మౌనంగా సహకరించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు తవ్వుకోండి, మేము అధికారంలోకి వస్తే మేము తవ్వుకుంటాం అనే అవగాహనతోనే ఈ దోపిడీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో, స్థానిక నేతలు మట్టి వ్యాపారంలో నిమగ్నమయ్యారని సమాచారం. జగ్గంపేటలో అయితే ఈ అక్రమ మైనింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా జరగడం లేదని, టీడీపీ, వైసీపీ నేతలు ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ (పరస్పర అంగీకారం) చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యావరణ ప్రేమికులు ఈ అక్రమ తవ్వకాలను ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (పర్యావరణానికి జరిగే నష్టాన్ని విచారించే ప్రత్యేక కోర్టు)ను ఆశ్రయించారు. వెంటనే తవ్వకాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో కొలతలు వేయడానికి సమయం పడుతుందని చెబుతూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తప్పించుకుంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని వాహనాలను సీజ్ చేస్తున్నా, అవి మళ్లీ మాయమవుతున్నాయి. ఇప్పటికే కొండ సగానికి పైగా కరిగిపోయింది, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు గాలిలో వేలాడుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే ఈ మైనింగ్ సిండికేట్ (అక్రమ వ్యాపార ముఠా) నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.








