జైపూర్ జిల్లా రాంపుర కన్వర్‌పుర గ్రామంలో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు సీజేపీ బృందం అక్కడికి చేరుకోగా, గ్రామస్తులు వారిని అడ్డుకుని గ్రామం నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే పాఠశాలలను తనిఖీ చేయకుండా వెళ్లేది లేదని సీజేపీ నేతలు అక్కడే నిరసనకు దిగారు.

ఈ క్రమంలో గ్రామస్తులు సీజేపీ నేతలపై దాడి చేశారు. తమపై రాళ్లతో దాడి చేశారని, కారు అద్దాలను పగులగొట్టారని, తమ బృందంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అశుతోష్ రాంకా ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం ఎస్‌ఎంఎస్‌ దవాఖానకు తరలించారు.

ఈ దాడి వెనుక రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ హస్తం ఉందని రాంకా ఆరోపించారు. పాఠశాల ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన పశువుల షెడ్డు విషయం బయటపడుతుందనే భయంతోనే మంత్రి తమపై దాడి చేయించారని ఆయన పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారిని 48 గంటల్లో అరెస్ట్ చేయాలని, పాఠశాలల తనిఖీలను అడ్డుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ డోటాస్రా స్పందిస్తూ, దాడి చేసింది గ్రామస్తులు కాదని, బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

అయితే, తాము సీజేపీ నేతలను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నామే తప్ప, వారిపై దాడి చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన బగ్రు డీఎస్పీ ధర్మేంద్ర శర్మ, తమకు అటువంటి పరిణామం జరిగినట్టు సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.