రాజన్న సిరిసిల్ల జిల్లాలో సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేశ్ బిగితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావంపై రూపొందించిన పీపీటీని అధికారులు ప్రదర్శించగా, 'తెలంగాణ జలసిరి' పోస్టర్లను మంత్రులు ఆవిష్కరించారు.

జిల్లాలోని రిజర్వాయర్ల నీటిమట్టం, పంటల సాగు విస్తీర్ణం, మిషన్ భగీరథ నీటి సరఫరా, విద్యుత్ సరఫరా అంశాలపై మంత్రి తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు రెండు మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా, వచ్చే ఏడాది జూలై వరకు రిజర్వాయర్లలోని నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రులు సూచించారు. దీనితో పాటు నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సూపర్ ఎల్ నినో ప్రభావంపై ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.