రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. కోర్టు వివాదాల వల్లే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందని ప్రభుత్వం అధికారికంగా చెబుతోంది. అయితే, ఈ విషయంలో రాజకీయ కారణాలే అసలైన అడ్డంకిగా మారాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

రాజమహేంద్రవరాన్ని మహానగరంగా మార్చాలనే లక్ష్యంతో, నగరానికి ఆనుకుని ఉన్న 24 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే, గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ సంఖ్యను పదికి కుదించారు. ఈ విలీన ప్రక్రియ తుది దశలో ఉండగా, హుకుంపేట పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, రాజవోలు పంచాయతీకి చెందిన అప్పటి జనసేన నాయకుడు, ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్న నక్క రాజబాబు కోర్టును ఆశ్రయించారు.

2014లో ఎన్నికైన పాలకవర్గం 2019లో పదవీకాలం పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేకాధికారుల పాలనలోనే నగరం నడుస్తోంది. విలీనం చేయాలనుకున్న గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకపోవడంతో, అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకే అధికారికి రెండు మూడు గ్రామాల బాధ్యతలు ఉండటంతో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ, తాజాగా ఎన్నికలు వాయిదా పడటం ఆశావహులను నిరాశకు గురిచేసింది. కోర్టుకు వెళ్ళిన కొద్దిమంది నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించవచ్చని, కానీ రాజకీయ సంకల్పం లోపించడం వల్లే ఎన్నికలు జరగడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2027లో జరగబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ రచ్చ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోందని కొందరి వాదన. విలీన ప్రక్రియ పూర్తయితే నగర జనాభా ఐదు లక్షలు దాటి, కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే, పుష్కరాలు ముగిసే వరకు ఎన్నికల జోలికి వెళ్ళకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకమండళ్లు వచ్చినా, రాజమహేంద్రవరం మాత్రం పుష్కరాలు పూర్తయ్యే వరకు ఎదురుచూడక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు.