నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఐటీ నిపుణుడు రాంబాబు తన మిత్రులతో కలిసి 2016లో హైదరాబాద్‌లో సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు.
ఈ సంస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన రైతు కుటుంబాలకు అందేలా చూడటంతో పాటు, అవసరమైతే వారి తరఫున న్యాయ పోరాటాలు చేస్తోంది. ఇప్పటివరకు 200 మంది విద్యార్థులకు విద్యాపరమైన సహాయం, కెరీర్ కౌన్సెలింగ్ అందించారు. మహిళా రైతులకు చేతి వృత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చి, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. సిద్దిపేట, నారాయణపేట, జనగామ జిల్లాల్లోని పలువురు మహిళలు ఈ సంస్థ సాయంతో పాడి పశువుల పెంపకం, పిండి గిర్నీలు, మిల్లెట్ బిస్కెట్ల తయారీ వంటి ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు.
ప్రతి రైతు కుటుంబ పరిస్థితిని అంచనా వేయడానికి ఫౌండేషన్ వలంటీర్లను నియమించింది. వీరి సాయంతో సుభిక్ష తోడున్న కుటుంబాలు ఏడాదికి సగటున 30 వేల నుంచి 50 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు పంట దిగుబడుల విక్రయాల్లో కూడా ఈ సంస్థ అండగా నిలుస్తోంది.
కష్టాల్లో ఉన్న మహిళా రైతులు తమకు కావాల్సిన సహాయం కోసం 897732576 నంబరులో సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ను సంప్రదించవచ్చు. కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.








