బెంగుళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుల ప్రవర్తన వల్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారి తీసింది.
శివశ్రీ ప్రయాణించిన రైలు కోచ్‌లో మొత్తం 56 సీట్లు ఉండగా, అందులో 40 మంది ప్రయాణికులు ఒకే బృందానికి చెందినవారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఆ ప్రయాణంలో, ఆ బృందం సభ్యులు నాన్-స్టాప్ గా శబ్దాలు చేస్తూ, గట్టిగా మాట్లాడుకుంటూ, అరుస్తూ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వారు యూనో (UNO) అనే కార్డుల ఆటను ఆడుతూ, పెద్దగా నవ్వుతూ గోల చేశారని ఆమె పేర్కొన్నారు.
ప్రయాణంలో ఎదురైన ఈ ఇబ్బందిపై ఆమె రైలు టికెట్ తనిఖీ అధికారికి (TT) ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అధికారి వారిని మందలించినప్పటికీ, ఆ బృందం సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదని శివశ్రీ తెలిపారు. ఎందుకు గోల చేస్తున్నారని టీటీ ప్రశ్నించగా, వారు నవ్వుతూ 'మీరు కూడా వచ్చి ఆడండి' అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని ఆమె వెల్లడించారు.
ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించేటప్పుడు ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాలని, గట్టిగా అరుస్తూ ఇబ్బంది కలిగించకూడదని శివశ్రీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కళాకారులుగా తమకు ఎన్నో ఆలోచనలు ఉంటాయని, కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రయాణం చాలా బాధాకరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బృందం వల్ల కోచ్‌లోని తోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడినప్పటికీ, మౌనంగా భరించాల్సి వచ్చిందని ఆమె వివరించారు.








