Raidurg| హైదరాబాద్‌, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రాయదుర్గంలోని ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ కార్పొరేషన్‌(టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్‌ నంబర్‌ పీ1 ఎకరా రూ.264 రికార్డు ధర పలికింది. హైదరాబాద్‌లో నిర్వహించిన భూముల వేలంలో ఇదే రికార్డు ధర అని అధికారులు వెల్లడించారు. మొత్తం 5.25ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదా యం సమకూరింది. పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్‌ ధర నిర్ణయించగా.. పోటాపోటీగా సాగిన వేలంలో ఎకరాకు రూ.264కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్‌ ధర కంటే దాదాపు 51% అధికమని అధికారులు తెలిపారు.

ఇదే ప్రాంతంలో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు రాగా మూడు నెలల్లోనే రికార్డు ధర పలికినట్టు టీజీఐఐసీ ఎండీ శశాంక తెలిపారు. ప్రముఖ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సంస్థ ఎంఎస్‌ఎన్‌ రాయదుర్గంలో నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని ఎకరా రూ.264కోట్లకు దక్కించుకున్నది. ఇదే సంస్థ గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన వేలంలో పాల్గొని ఎకరా రూ.177 కోట్లకు దక్కించుకున్నది.

రాయదుర్గంలో భూముల వేలం ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూ ము ల వేలంపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. వేలం ప్రక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్‌సింహారావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అభ్యంతరం ఉంటే హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సీజేఐ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.