రానున్న ఎన్నికల్లో కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే భీమ్ ఆర్మీ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలు కొత్త రాజకీయ నాయకులను సృష్టిస్తాయని, ఈ క్రమంలోనే దీప్కే రాజకీయ రంగప్రవేశం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా ఉద్యమాల ప్రభావంపై స్పందిస్తూ, జెపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, అన్నా హజారే ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకులుగా ఎదిగారని దూబే గుర్తుచేశారు. నేపాల్‌లో జెన్ జెడ్ ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా రాజకీయ పార్టీల్లో చేరడం అనివార్యమైందని ఆయన ఉదహరించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమకారులు సైతం ప్రధాని నరేంద్ర మోడీనే తమ నాయకుడిగా భావిస్తూ, సమస్యల పరిష్కారం కోసం ఆయన వైపు చూస్తున్నారని తెలిపారు.

మంగళవారం జరిగిన ఎన్‌డిఎ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ యువత సమస్యలపై చర్చించారని దూబే వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు స్పందిస్తూ, 1975లో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.