ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాబోయే మూడు గంటల వ్యవధిలో పలు జిల్లాలకు పిడుగుపాటు ప్రమాద హెచ్చరికను విడుదల చేసింది. ఈ మేరకు మన్యం, విజయనగరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ ను అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ (హెచ్చరిక) జారీ చేయగా, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (సూచన) ఇచ్చారు. ఈ జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

మరోవైపు విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా సుమారు ఒక గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి బీచ్ రోడ్డులో వరద నీరు పెద్ద ఎత్తున చేరగా, రహదారులు మరియు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.