చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిన ఫిఫా వరల్డ్ కప్ 2026 జూలై 19, ఆదివారం నాడు న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో తన చివరి ఘట్టానికి చేరుకోనుంది. 48 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ యాక్షన్ లెజెండ్ టామ్ క్రూజ్, గ్లోబల్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఐషోస్పీడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నారు.
టామ్ క్రూజ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందనే వివరాలను నిర్వాహకులు గోప్యంగా ఉంచగా, ఐషోస్పీడ్ పాల్గొనడం యువతలో భారీ ఉత్సాహం నింపింది. వీరితో పాటు లారా పాసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్ లైవ్ షోలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. ఆస్కార్, గ్రామీ అవార్డు గ్రహీత జెన్నిఫర్ హడ్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమానికి తెరలేపనున్నారు.
బాలీచ్ వండర్ స్టూడియో సహకారంతో రూపొందిన ఈ విజువల్ వండర్ షోను చూడాలనుకునే అభిమానుల కోసం స్టేడియం గేట్లను ఉదయం 11 గంటలకే తెరిచి ఉంచనున్నారు. గేట్లు తెరిచినప్పటి నుంచే స్టేడియంలో ప్రత్యేక వినోద కార్యక్రమాలు సాగుతాయి. అయితే, మ్యాచ్ మధ్యలో జరిగే హాఫ్ టైమ్ షోకు, మ్యాచ్ ముందు జరిగే ఈ క్లోజింగ్ సెర్మనీకు పూర్తిగా భిన్నమైన ఆర్టిస్టులు, ప్రొడక్షన్స్ ఉంటాయని ఫిఫా స్పష్టం చేసింది.
ఒకే రోజు ఫుట్‌బాల్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనుభవం దక్కనుందని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు జరిగే ఈ భారీ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.







