2027 జనవరి 21 నుంచి మార్చి 3 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2004-05 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవని ఆస్ట్రేలియా, ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. యాషెస్ సిరీస్ తర్వాత బీజీటీనే తమకు అతిపెద్ద సవాలుగా మారిందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ప్రస్తుత ఆస్ట్రేలియా టెస్టు జట్టు సగటు వయసు 33 ఏళ్లకు చేరడం బోర్డుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు ఆస్ట్రేలియా 'ఎ' (Australia A) పర్యటనను వేదికగా మార్చుకుంటోంది. కూపర్ కానలీ, జేవియర్ బార్ట్లెట్, ఆలీ పీక్, సామ్ కాన్స్టాస్, కాంప్‌బెల్ కెల్లావే, నాథన్ మెక్‌స్వీనీ, కోరీ రోచిసియోలి, ఫెర్గస్ ఓ నీల్ వంటి యువ ప్రతిభావంతులను ఈ పర్యటన ద్వారా పరీక్షించనున్నారు.
ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, భారత ఉపఖండ పరిస్థితులలో నిలకడగా రాణించే అనుభవం యువ ఆటగాళ్లకు చాలా అవసరమని స్పష్టం చేశారు. కొందరు ఆటగాళ్లు జింబాబ్వే, సౌతాఫ్రికా పర్యటనల తర్వాత ఇండియా 'ఎ' టూర్లో చేరతారని, మరికొందరికి మాత్రం భారత్ పర్యటనకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.
రాబోయే సెప్టెంబర్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికా పర్యటనలు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా సెలెక్టర్లు తమ అగ్రశ్రేణి యువ ఆటగాళ్లను భారత్‌లో జరిగే 'ఎ' టూర్‌కే పంపాలని నిర్ణయించుకున్నారు. తద్వారా 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహాల కంటే, భారత పిచ్‌లపై టెస్టు సిరీస్ గెలవడానికే ఆస్ట్రేలియా బోర్డు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.








