విజయవాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం కింద విత్తనం వేసిన ప్రతి రైతును తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 100 శాతం నమోదు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో పాటు ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
ఎరువుల లభ్యతపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే రైతులు కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్ నంబర్ 91549 70454ను సంప్రదించేలా, ప్రతి దుకాణం వద్ద ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. అలాగే, వర్షాలు ఆలస్యమైనప్పుడు విత్తనం మొలక శాతం పెంచేందుకు సీడ్ పెల్లెటింగ్ విధానాన్ని అందరు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
పంట మార్పిడిపై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని, ఇప్పటివరకు జరిగిన మార్పులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు, 'నెట్ జీరో' లక్ష్య సాధనలో భాగంగా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, హాస్టళ్ల నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న స్థలాలను హరితవనాలుగా మార్చాలని ఆయన సూచించారు.
జిల్లా అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. వరద నివారణ చర్యలు, 22ఏ దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై కూడా ఆయన అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలని ఆయన అధికారులను కోరారు.








