తెలంగాణలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలు ఆస్తులు అమ్ముకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ఇప్పటికే రూ.5,626 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.

గత ప్రభుత్వం ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్ ప్రాంతాల్లో టీమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - TIMS) ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేసినా పనులు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే, ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను 2027 డిసెంబర్ 9లోపు పూర్తి చేస్తామని, ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వైద్యులు అదనపు సమయం పనిచేసేలా ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరువు రావాలని పూజలు చేయడం మానేసి, నల్లమల అడవులకు వెళ్లి పూజలు చేయాలని, గతంలో దోచుకున్న సొమ్ముతో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేస్తే పాపం తగ్గుతుందని ఆయన ఎద్దేవా చేశారు.