ప్రస్తుతం యాక్షన్, హారర్, డార్క్ కామెడీ వంటి సినిమాలు ట్రెండ్‌లో ఉన్న సమయంలో ఫ్యామిలీ సినిమా తీయడంపై చాలామంది తనను నిరుత్సాహపరిచారని వెంకీ అట్లూరి చెప్పారు. అయితే, నిర్మాత నాగవంశీ మాత్రం తనపై నమ్మకంతో పూర్తి మద్దతు ఇచ్చారని, ఆయన లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు.

సినిమా విడుదలైన తర్వాత వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు ఏకంగా 100 శాతం పెరగడం తాను మొదటిసారి చూస్తున్నానని వెంకీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఈ సినిమాను తమ భుజాలపై మోసి, తనను ఆర్థికంగా నిలబెట్టారని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ విజయంలో హీరో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్, హర్ష, వెంకట్ మాస్టర్ సహకారం ఎంతో ఉందని వెంకీ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సూర్య నటనకు, రవీనా టాండన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.