ఫిలిప్పీన్స్ తీరంలో జెస్సర్ సెర్వాంటెస్ అనే మత్స్యకారుడు తన చిన్న చెక్క పడవలో చేపలు పడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గత నెలలో ఆయనకు ఒక ఆక్టోపస్ దొరికింది.

ఆక్టోపస్‌ను పడవలోకి తీసుకోగానే అది ఒక్కసారిగా ఆయన ముఖంపైకి ఎగబాకింది. తన బలమైన టెంటకిల్స్‌తో (ఆక్టోపస్ చేతులు) ఆయన తలను గట్టిగా చుట్టేసింది.

ఆక్టోపస్ టెంటకిల్స్‌కు ఉండే శక్తివంతమైన వ్యాక్యూమ్ కప్పులు (పీల్చుకునే గుణం ఉన్న పట్టు సాధనాలు) ఆయన ముఖానికి బలంగా అంటుకున్నాయి. దీంతో ఆయన నోరు, ముక్కు పూర్తిగా మూసుకుపోయి ఊపిరి ఆడక పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

ప్రాణాలను కాపాడుకునేందుకు సెర్వాంటెస్ ఒక వెదురు కర్రను తీసుకుని ఆక్టోపస్‌పై పలుమార్లు కొట్టాడు. కాసేపటికి దాని పట్టు సడలడంతో ఆయన ముఖం నుంచి దాన్ని వేరు చేయగలిగాడు.

ఆ తర్వాత సెర్వాంటెస్ ఆ ఆక్టోపస్‌ను తిరిగి సముద్రపు నీటిలోకి వదిలేశాడు. ఈ భయంకర అనుభవం గురించి చెబుతూ, అది తన ముఖాన్ని చీల్చేసేంత బలంగా పట్టుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సెర్వాంటెస్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.