ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన 'ది ఒడిస్సీ' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

భారతదేశంలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు రూ. 17.40 కోట్ల వసూళ్లు రాగా, శనివారం (జూలై 18) ఆ సంఖ్య రూ. 22 కోట్లకు పెరిగింది. దీంతో రెండు రోజుల్లో ఇండియాలో సుమారు రూ. 39.40 కోట్ల షేర్, రూ. 47.03 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 257.8 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 2,150 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా సాధించింది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే వంటి తారలు నటించిన ఈ చిత్రాన్ని సుమారు రూ. 2,000 కోట్ల బడ్జెట్‌తో ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ నిర్మించారు.

ఆదివారం కూడా సెలవు దినం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినిమా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.