ప్రస్తుతం మార్కెట్‌లో కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగాయి. ఫామ్‌గేట్ వద్ద అంటే కోళ్ల ఫారాల దగ్గర ఒక గుడ్డు ధర రూ.7 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.8.50 నుంచి రూ.9 వరకు అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే ఇది 40 శాతం పెరుగుదల.

ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ తయారీ ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీ కోసం చెరుకుతో పాటు మక్కజొన్నను కూడా వాడుతున్నారు. కోళ్ల ఫారాల్లో పక్షులకు ఇచ్చే మేతలో 50 నుంచి 55 శాతం మక్కజొన్నే ఉంటుంది. ఈ మక్కజొన్నను ఇథనాల్ తయారీ కేంద్రాలకు తరలించడంతో మేత ధరలు పెరిగి, ఫలితంగా గుడ్ల ధరలు కూడా పెరిగాయి.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీశాఖ సహాయ మంత్రి నిముబెన్‌ జయంతిభాయ్‌ బంభానియా లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇథనాల్ తయారీలో మక్కజొన్న వినియోగం భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 125.75 లక్షల మెట్రిక్ టన్నుల మక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే ఇథనాల్ కోసం మక్కజొన్న వాడకం 8.3 లక్షల టన్నుల నుంచి 125.75 లక్షల టన్నులకు చేరింది.

అంతేకాదు, 2024-25లో మక్కజొన్న ఆధారిత డిస్టిలరీలకు అంటే ఇథనాల్ తయారు చేసే పరిశ్రమలకు 477.8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వం కేటాయించింది. 2025-26 సంవత్సరానికి కూడా 125.78 లక్షల టన్నుల మక్కజొన్నను ఇథనాల్ తయారీకే కేటాయించారు.

రాబోయేది చలికాలం కావడంతో గుడ్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలో లభించే ప్రొటీన్ వనరుగా కోడిగుడ్డుకు పేరున్న నేపథ్యంలో, ధరల పెరుగుదల సామాన్యులపై మరింత భారం మోపుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.