కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా హైదరాబాద్ నగరంలో ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ హయాంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అత్యంత విలువైన ప్రాంతాల్లో నిర్మించి పేదలకు ఉచితంగా అందించామని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో భారీగా ప్రచారం చేస్తూ, సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి రూ. 6 లక్షలు వసూలు చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. పేదరికంలో ఉన్న వారి నుంచి అంత మొత్తాన్ని తీసుకోవడం అన్యాయమని, సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను తాము ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే ఇప్పుడు కూడా దరఖాస్తుల కోసం రూ. 10 వేలు చెల్లించాలనే నిబంధన పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న 39 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్లు ఇచ్చే తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానిస్తామని ఆయన ప్రకటించారు.

బిఆర్‌ఎస్ హయాంలో లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఇళ్లు కేటాయించామని, మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని తలసాని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, మాధవరం కృష్ణా రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి పాల్గొన్నారు.