తెలంగాణలో పేద కుటుంబాలకు వివాహ ఆర్థిక సాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాల అమలు తీరును సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
చట్టసభల్లో తీర్మానం చేయకుండా కేవలం జీవోల ద్వారానే ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. గతంలో ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ, నాలుగు వారాలు గడిచినా స్పందన లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లబ్ధిదారులకు ఎటువంటి చెల్లింపులు చేయకూడదని స్పష్టం చేసింది.
ఈ మధ్యంతర ఉత్తర్వులతో పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం సమర్పించే వివరణ ఆధారంగానే ఈ పథకాల భవిష్యత్తుపై స్పష్టత రానుంది. ఈ కేసులో సమగ్ర వాదనలు వినేందుకు గాను తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.








