రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ముసాయిదా జాబితాలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వలసలు అధికంగా ఉండటంతో, 15 నియోజకవర్గాల్లో 15 శాతానికి పైగా ఓటర్ల వివరాలు అందుబాటులో లేవు. ఈ నియోజకవర్గాలన్నీ పట్టణ ప్రాంతాలకు చెందినవే కావడం గమనార్హం.
ఓటర్ల వివరాలు తెలియని నియోజకవర్గాల్లో తిరుపతి మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 2,95,288 మంది ఓటర్లు ఉండగా, వారిలో 90,882 మంది ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించలేదు. ఇందులో 19.39 శాతం మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు ముసాయిదా జాబితా పేర్కొంది. తిరుపతి తర్వాత గుంటూరు వెస్ట్, కర్నూలు, కాకినాడ సిటీ, కోవూరు, రాజమండ్రి సిటీ, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా సగటున 10.78 శాతం మంది ఓటర్ల వివరాలు తెలియరాలేదు. తక్కువ సంఖ్యలో ఓటర్ల వివరాలు తెలియని నియోజకవర్గాల్లో నరసాపురం 4.96 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉండి, ఉంగుటూరు, పి.గన్నవరం, రాజానగరం, భీమవరం, ఆచంట నియోజకవర్గాలు ఉన్నాయి.








