బిహార్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) — ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే సంస్థ — నిర్వహించిన 70వ పరీక్షను రద్దు చేయాలని వందలాది మంది విద్యార్థులు డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా పట్నాలోని గార్డనిబాగ్‌లో నిరసనలు చేస్తున్న అభ్యర్థులు, మంగళవారం సీఎం సమ్రాట్ చౌధరి నివాసం వైపు ర్యాలీ తీశారు. ఈ క్రమంలో వారు బారికేడ్లను దాటడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి, వాటర్ క్యానన్లతో వారిని చెదరగొట్టారు.

ఈ ఆందోళనలో భూ సమస్యలపై పోరాడుతున్న రైతు సంఘం సభ్యులు కూడా నల్ల జెండాలతో చేరారు. దీంతో అక్కడ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలను ప్రభుత్వం మోహరించింది. బీపీఎస్‌సీ-టీఆర్‌ఈ 4 ఒకే పరీక్ష నిర్వహించాలని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉండాలని, బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) పరీక్షల్లో హిందీ మీడియం విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థి ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా సాగాయని విద్యార్థి నాయకుడు సౌరవ్ కుమార్ చెప్పినప్పటికీ, తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. కింది స్థాయి అధికారులతో చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

తమ సమస్యలను నేరుగా సీఎం లేదా డిప్యూటీ సీఎంతో చర్చించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యాశాఖ మంత్రిని కలిసే అవకాశం కల్పించినా అంగీకరిస్తామని, అంతకు మించి వేరెవరితోనూ చర్చలు జరపమని వారు తేల్చి చెప్పారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు నిరసన విరమించేది లేదని విద్యార్థి నాయకుడు ఒకరు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సీఎం సమ్రాట్ చౌధరి స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ‘విద్యార్థి సహ్యోగ్‌ శిబిరం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, 1100 హెల్ప్‌లైన్ నంబర్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా వాటి స్థితిని తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.