న్యూఢిల్లీ: భారత మహిళల బ్యాడ్మింటన్‌‌లో కొత్త తరం సత్తా చాటుతోంది. కోచ్‌‌ పార్క్‌‌ టే-సాంగ్‌‌ శిక్షణలో తాన్వీ శర్మ, అష్మిత చలిహా వరుసగా రెండు వారాల్లో రెండు బీడబ్ల్యేఎఫ్​ సూపర్‌‌–300 టైటిళ్లు సాధించారు. గత ఆదివారం 17 ఏళ్ల తాన్వీ తైపీ ఓపెన్‌‌ గెలవగా.. వారం తర్వాత 26 ఏళ్ల అష్మిత కొరియా మాస్టర్స్‌‌ విజేతగా నిలిచింది. ఈ విజయాలు భారత బ్యాడ్మింటన్‌‌ భవిష్యత్‌‌పై నమ్మకాన్ని పెంచాయని పార్క్‌‌ తెలిపాడు.

గతంలో పీవీ సింధుతో నాలుగేండ్లు పనిచేసిన పార్క్‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌లో ఆమె కాంస్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం గువాహటిలోని నేషనల్‌‌ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌లో యువ ప్లేయర్లను తీర్చిదిద్దే బాధ్యత చేపట్టాడు. భారత బ్యాడ్మింటన్‌‌కు కొత్త తరం స్టార్లను తయారు చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. 2028 లాస్‌‌ ఏంజెలెస్‌‌ ఒలింపిక్స్‌‌ క్వాలిఫికేషన్‌‌ రేసే తమ ప్రధాన లక్ష్యమని పార్క్‌‌ స్పష్టం చేశాడు.

వచ్చే ఏడాది మే 1 నుంచి క్వాలిఫికేషన్‌‌ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో తాన్వీ, అష్మితలను సూపర్‌‌–500, 750, 1000 టోర్నీలకు సిద్ధం చేస్తామన్నాడు. ప్రపంచ నంబర్‌‌–1 అన్‌‌ సె-యంగ్‌‌ను బెంచ్‌‌మార్క్‌‌గా తీసుకుని మానసిక దృఢత్వం, ఫిట్‌‌నెస్‌‌, కోర్టులో వేగాన్ని పెంచుకోవాలని సూచించాడు. దేవికా సిహాగ్‌‌, ఉన్నతి హుడా, తాన్వీ, అష్మిత మధ్య పోటీ భారత మహిళల సింగిల్స్‌‌ భవిష్యత్‌‌కు శుభసూచకమని పేర్కొన్నాడు.