నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో, 2024 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026'ను రూపొందించింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో, ఇది అధికారికంగా చట్టరూపం దాల్చింది.
ఈ కొత్త చట్టం ప్రకారం, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల తారుమారు, నకిలీ అడ్మిట్ కార్డులు, నకిలీ వెబ్‌సైట్ల సృష్టి వంటి 15 రకాల చట్టవిరుద్ధ చర్యలను ఇందులో నేరాలుగా పేర్కొన్నారు.
కేసుల విచారణను వేగవంతం చేసేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. చార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల లోపే ఈ కోర్టులు విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, లీకేజీ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా ముగించాలనే నిబంధనను కూడా ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.








