ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గుడ్డి దేవి, హరియాణాలోని రమేష్ నగర్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కాలు విరగడంతో, కుటుంబ సభ్యులు ఆమెను పానిపట్‌లోని జీటీ రోడ్డులో ఉన్న పార్క్ హాస్పిటల్‌లో చేర్పించారు.

అయితే, కాలుకు చికిత్స చేయాల్సిన వైద్యులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గుడ్డి దేవికి గుండె శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. ఆపరేషన్ పూర్తయిన మరుసటి రోజు మాత్రమే ఈ విషయాన్ని వారు కుటుంబ సభ్యులకు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం గుడ్డి దేవి చికిత్స పొందుతూ మరణించింది.

వైద్యుల తీరుపై మృతురాలి కుమారుడు కుల్దీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా, తమపై ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం ఉండదని వారు సమాధానమిచ్చినట్లు కుల్దీప్ మీడియాకు తెలిపారు. దీంతో ఆయన పానిపట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 106, 318 (4), 351 (2) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.