పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామ పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే నిధులను ఇప్పటివరకు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సి వచ్చేది. దీనివల్ల నిధుల వినియోగానికి అనుమతులు, పత్రాల ప్రక్రియతో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.
ఈ కొత్త సవరణతో ఇకపై పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకోవచ్చు. దీనివల్ల తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, మోటార్ల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ వంటి అత్యవసర పనులకు నిధులను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే వాడుకునే అవకాశం కలుగుతుంది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంచడమే ఈ మార్పు ఉద్దేశమని మంత్రి సీతక్క వివరించారు.
గత ప్రభుత్వం పంచాయతీల పట్ల వివక్ష చూపిందని, దాన్ని రూపుమాపడానికే ఈ చట్ట సవరణ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ అంటే నిధులను డ్రా చేసే అధికారంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆమె సభకు హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి గ్రామానికి పక్కా రహదారులు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని ఆమె తెలిపారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాలపై రూ. 2 వేల కోట్ల అదనపు భారం పడుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర అటవీ చట్టాలు అడ్డంకులుగా మారుతున్నాయని, వీటిని తొలగించేలా కేంద్రం నుంచి క్లియరెన్స్ ఇప్పించాలని బీజేపీ సభ్యులను కోరారు. బీసీ రిజర్వేషన్ల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని, ఆ కాలానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు పూర్తి స్థాయిలో అందలేదని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతి నెల గ్రామ పంచాయతీల కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు వెచ్చిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రెండో విడత నిధులు రూ. 619 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని, గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని ఆమె వివరించారు.








