పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మరణించాడు. తనపై, తన తండ్రిపై పది రోజుల క్రితం జరిగిన దాడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా తమనే వేధించారని నాగరాజు ఆరోపించాడు.

మరణానికి ముందు నాగరాజు ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ తనను తీవ్రంగా బెదిరించారని ఆ వీడియోలో పేర్కొన్నాడు. తనపై, తన పిల్లలపై రివర్స్ కేసులు పెడతామని సీఐ హెచ్చరించారని, ఈ వేధింపులు భరించలేకే తాను ప్రాణాలు తీసుకుంటున్నానని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

స్థానిక పోలీసులు లంచాలను ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, గతంలో కూడా వీరిపై ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయని చెబుతున్నారు.

నాగరాజు మృతదేహంతో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధ్యులైన సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని, ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.