విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు ప్రకాశం జిల్లా కొండ మంజులూరు నుంచి వేలూరు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, సువార్తమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ (ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి)కు తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.