గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 (Aprilia RS 457) బైక్‌పై వెళ్తున్న సియా అనే యువతిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సియా బైక్ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తరపు న్యాయవాదితో కలిసి పోలీస్ అధికారులను కలిసినట్లు సియా సోదరుడు తెలిపారు.

సియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమెతో పాటు మరికొందరు బైకర్లు రోడ్డుపై వెళ్తుండగా ఒక కారు వెనుక నుంచి అనుసరించింది. కారును దూరంగా ఉండమని సైగ చేసినప్పటికీ, డ్రైవర్ కావాలనే బైక్ వైపు వచ్చి ఢీకొట్టాడని ఆమె ఆరోపించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నారని సియా సోదరుడు పేర్కొన్నారు.

అయితే, కారు డ్రైవర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగిందని, కావాలని ఢీకొట్టలేదని ఆయన చెప్పారు. ఆ సమయంలో బైకర్ అక్కడ ఉన్న విషయాన్ని తాను గమనించలేదని డ్రైవర్ వివరణ ఇచ్చారు.

ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సుమారు 20 నుంచి 22 మంది బైకర్లు ఉన్నారని డ్రైవర్ తెలిపారు. వారిని నెమ్మదిగా వెళ్లమని మాత్రమే కోరానని, తాను ఎలాంటి అసభ్యకర సైగలు చేయలేదని చెప్పారు. కారు ఆపితే బైకర్లు తనపై దాడి చేస్తారనే భయంతోనే అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు సియా, కారు డ్రైవర్ చెప్పిన భిన్నమైన విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.