గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో తన స్పోర్ట్స్ బైకుపై వెళ్తున్న యువతిని, కారులో వచ్చిన వ్యక్తులు వెంబడించి ఢీకొట్టారు. ఈ ఘటనలో బైకర్ కిందపడి తీవ్రంగా గాయపడగా, ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బైకు నుంచి నిప్పులు చిమ్ముకుంటూ కొంత దూరం వెళ్లి ఆగింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బైకర్ హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే బైకును ఢీకొట్టినట్లు కనిపిస్తుండటంతో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలు తనను కారు వెంబడించిందని, డ్రైవర్ దూకుడుగా వ్యవహరించి ఢీకొట్టాడని ఆరోపించింది.

ప్రమాదానికి కారణమైన కారును అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కళ్యాణ్ బైన్స్లా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా స్పందించి, గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ (పోలీసులకు ఇచ్చే ప్రాథమిక ఫిర్యాదు నివేదిక) నమోదు చేశారు. బాధితురాలు కూడా తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు కోరింది.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను కళ్యాణ్ బైన్స్లా ఖండించాడు. బైకును తాను కావాలనే ఢీకొట్టలేదని, ప్రమాద సమయంలో బైకుపై మహిళ ఉందని కూడా తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదానికి ముందు బైకర్లు తన కారును ఓవర్‌టేక్ చేసి, ముందుకు వచ్చి వేగం తగ్గించారని, ఆ సమయంలో కారు అద్దాన్ని గమనించకుండా వారు బైకును తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని తన వాదన వినిపించాడు.

తప్పు జరిగిందని అంగీకరించినప్పటికీ, తాను బైకర్లను ఢీకొట్టేందుకు ప్రయత్నించలేదని బైన్స్లా పేర్కొన్నాడు. తనపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని అన్నాడు. ప్రస్తుతం బాధితురాలి ఆరోపణలు, నిందితుడి వాదనలు భిన్నంగా ఉండటంతో, వీడియో ఆధారాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.