సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘బెల్ట్’ షాపులపై పల్లెలు తిరగబడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్ట్‌షాపులపై నిషేధం అమల్లో ఉండగా, తాజాగా మరికొన్ని మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తున్నాయి. ‘మా గ్రామాల్లో మద్యం అమ్మకాలు వద్దు’ అంటూ గ్రామస్తులే స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్నారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఉద్యమానికి పురుషులు సైతం మద్దతు పలుకుతుండటం విశేషం.
మద్యం అమ్మ కాల్లో రాష్ట్రంలోనే జిల్లా టాప్‌లో ఉంది. జిల్లాలో 249 వైన్‌షాపులు ఉండగా, వీటి ద్వారా నెలకు సగటున రూ.350 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. పట్టణం, పల్లె తేడా లేకుండా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్ట్‌షాపులు వెలిశాయి. సరిగ్గా పాతికేళ్లు లేని వారు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారు. బానిసైన వారు చివరకు విచక్షణ కోల్పోయి, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాగుడుకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన తల్లిదండ్రులు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులు రోడ్డునపడాల్సి వస్తోంది. జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని పల్లెలు కంకణం కట్టుకున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి తీర్మానాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 514 వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్ ఎకై ్సజ్ పరిధిలో 111 దుకాణాలు ఉండగా, సరూర్‌నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 ఉన్నాయి. వికారాబాద్ ఎకై ్సజ్ జిల్లా పరిధిలో 59, మేడ్చల్ ఎకై ్సజ్ పరిధిలో 118, మల్కాజ్‌గిరి పరిధిలో 88 షాపులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణానికి వంద చదరపు మీటర్లలోపు పర్మిట్ రూమ్ ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే విక్రయించాలి. పర్మిట్‌రూం వెలుపల మద్యం తాగడానికి వీల్లేదు. ఇందుకు విరుద్ధంగా కొన్ని దుకాణాలు వ్యవహరిస్తున్నాయి. చేపలు, చికెన్ ఫ్రై, బోటీ, తలకాయసూపు, వంటి వాటిని కూడా ఇక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్‌లో సరైన సదుపాయాలు లేక మెజార్టీ మద్యం ప్రియులు రోడ్లపైనే వాహనాలు నిలిపి తాగుతున్నారు. వచ్చేపోయే వాహనదారులు, పాదచారులు, మహిళలతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాలనీల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. హత్యలకు, అనేక వివాదాలకు కారణమవుతు న్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. అయినా ఎకై ్సజ్ శాఖ పట్టించుకోవడం లేదు. పోలీసులు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. దీంతో మహిళా సంఘాలు మద్యం అమ్మకాలపై ఆందోళనకు దిగుతున్నాయి.
ప్రజల సహకారంతో ఏప్రిల్ 14 నుంచి బెల్టుషాపుల నిషేధం విజయవంతగా కొనసాగుతోంది. బెల్టు షాపులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మహిళలు ముందుకు వచ్చి బెల్టుషాపులను మూసివేయించాలని పట్టుబట్టారు. దీంతో పంచాయతీ సమావేశంలో బెల్టుషాపులు మూసివేయాలని తీర్మానం చేశాం. దీనిని ఇలాగే కొనసాగిస్తాం.








