ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. గతంలో ఆంధ్రా పాలకుల కుట్రల వల్ల మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, నీటి కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగానే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, అందుకే రిజర్వాయర్లను నింపడం లేదని ఆయన మండిపడ్డారు.

ఎగువన కర్ణాటక రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గేట్ల లీకుల ద్వారా వచ్చే నీటితో లక్ష ఎకరాలకు సాగునీరు అందేదని, ఇప్పుడు కర్ణాటక హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి నీటిని వదలడం లేదని ఆయన వివరించారు. కర్ణాటక ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో కరువు పరిస్థితులు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు.

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నీటి హక్కులను కాపాడాలని లక్ష్మారెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేసిన ఆయన, జిల్లాకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని పునరుద్ఘాటించారు.