ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని ఆయనను కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది.
ఈ సదస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శనలు, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి మంత్రి హాజరైతే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఎక్స్‌పోను నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో కోసం గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలని కోరారు. అలాగే, హెచ్‌ఏఎల్ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్), ఎండీఎల్ (మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ) ప్రయోగశాలలు తమ సాంకేతికతను ప్రదర్శించాలని కోరారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించామని, రక్షణ శాఖ కోరినట్లు మరో 750 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి సీఎం వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్‌డీఎల్ (రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల) ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) అంగీకరించిందని తెలిపారు.
ఈ భూమిని సంవత్సరానికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజు అద్దెతో 33 ఏళ్ల కాలానికి కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అవసరమైతే ఈ లీజును మరో రెండుసార్లు పొడిగించుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. విదేశీ రక్షణ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకారం అందించాలని కోరుతూ సీఎం తన విజ్ఞప్తులను ముగించారు.








