2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటనపై మొదట స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ కేసులో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది.
ఈ దాడికి సూత్రధారిగా ఉన్న హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా చేరుస్తూ ఎన్‌ఐఏ జూలైలో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 కింద ఇతనిపై అభియోగాలు నమోదయ్యాయి. భారత్‌పై యుద్ధం చేయడం, పాకిస్థాన్ నుంచి దాడికి కుట్ర పన్నడం వంటి ఆరోపణలను ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
హఫీజ్ సయీద్‌పై ఇప్పటికే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అతడిని విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా పాకిస్థాన్‌కు పంపనున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
ఈ కేసులో సజిద్ జట్ అనే అనుమానిత హ్యాండర్‌తో పాటు ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు, అరెస్టైన ఇద్దరు నిందితుల వివరాలను కూడా ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. మొత్తం 1,597 పేజీల ఛార్జిషీట్ ద్వారా దాడి ప్రణాళిక, అమలులో హఫీజ్ సయీద్ పాత్రను కోర్టుకు వివరించింది.
ఒకవేళ చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా హఫీజ్ సయీద్ కోర్టుకు హాజరుకాకపోతే, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 356 ప్రకారం విచారణ కొనసాగుతుంది. నిందితుడు గైర్హాజరులోనే అతడిపై శిక్షను ఖరారు చేసేందుకు న్యాయస్థానం ప్రక్రియను సిద్ధం చేస్తోంది.








