కర్నూలు సిటీ, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 (ఎస్‌ఐఆర్-2026) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.లావణ్య వేణి సూచించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఎస్‌ఐఆర్-2026 అంశంపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై చర్చించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.








