రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు వంటి లావాదేవీలను నిలిపివేసే 22ఏ నిషేధిత భూముల జాబితాలో తమ ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా కొత్తగా చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ జాబితా వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

గతంలో హైకోర్టుకు సమర్పించిన జాబితాలో అధికారులు పాత వివరాలను యథావిధిగా అప్‌లోడ్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని గతంలో మంత్రి పొంగులేటి అంగీకరించారు. ప్రైవేట్ భూములు, పట్టా భూములు, గతంలో ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇచ్చిన యూఎల్‌సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూములు కూడా పొరపాటున ఈ జాబితాలో చేరాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఆగస్టు 17న జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై తప్పు జరిగిందని అంగీకరిస్తూ, ప్రజలను క్షమాపణ కోరారు.

ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లాలోనే 10,395 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇందులో దేవేందర్‌నగర్, రేణుకానగర్, వినోభానగర్, తారకరామనగర్, శ్రీ సాయిరామ్‌నగర్, కృష్ణ హిల్స్, కాకతీయనగర్ వంటి 18 కాలనీల్లోని 5,118 ఇండ్లు ఉన్నాయి. ఉప్పల్ పరిధిలోని బీజేఆర్‌నగర్, లక్ష్మీనరసింహ కాలనీ, జైపురి కాలనీల్లోని మరో 1,623 ఇండ్లు కూడా ఈ జాబితాలో చిక్కుకున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆగస్టు 13న కూకట్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో నిషేధిత జాబితాలో తప్పులు జరిగాయని అంగీకరించారు. బాధితుల భూములను జాబితా నుంచి తొలగించి, మళ్లీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మాట మారుస్తున్నారని, సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, సామాన్యుల ఆస్తుల విలువ తగ్గిపోతున్నదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సమస్య పరిష్కారం కోసం వందలాది మంది బాధితులు ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వివాదంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఐదు నెలలుగా ఆందోళన కొనసాగుతూనే ఉంది.