ఒంగోలు రాజకీయాల్లో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దామచర్ల అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారని బాలినేని ఆరోపించగా, వైసీపీ హయాంలో బాలినేని చేసిన అవినీతిపై పుస్తకాలు కూడా సరిపోవని దామచర్ల కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని, 30 వేల మెజార్టీతో గెలుస్తానని బాలినేని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
జనసేన అధికార పార్టీగా ఉన్నా తమకు ఎలాంటి అధికారాలు లేవని, కేవలం పేరుకే పార్టీలో ఉన్నామని బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒంగోలు కార్పొరేషన్‌లో మిస్సైన రూ.8.5 కోట్లపై దామచర్ల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన అనుచరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన బాలినేని, ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. అవినీతిపై సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పి దామచర్లపై విచారణ చేయిస్తానని బాలినేని సవాల్ విసిరారు.
ఈ పరిణామాలతో కూటమి పార్టీల సమన్వయ కమిటీ రంగంలోకి దిగింది. వ్యక్తిగత విమర్శలు ఆపి, సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఇద్దరు నేతలకు సూచించింది. మంత్రి అచ్చెన్నాయుడు దామచర్లతో మాట్లాడగా, జనసేన అగ్రనేతలు బాలినేనికి సంయమనం పాటించాలని సూచించారు. ప్రస్తుతం మీడియా ముందు విమర్శలు చేయకుండా ఇద్దరు నేతలను కూటమి పెద్దలు నిలువరించారు. అయితే, భవిష్యత్తులో ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనే అంశంపై ఒంగోలు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.







