వరంగల్, కరీంనగర్, జగిత్యాల నగరాలను కలుపుతూ సాగే రహదారిని నేషనల్ హైవే 563గా అభివృద్ధి చేసే ప్రక్రియ 2014 మార్చిలోనే మొదలైంది. అప్పట్లో ఎంపీగా ఉన్న ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన కార్యాలయం శనివారం ప్రకటించింది.
ఈ రహదారిని సుమారు 130 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిగా (ఫోర్ లేన్) మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులను జాతీయ రహదారుల అభివృద్ధిని చూసే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు అప్పగించినట్లు నాటి కేంద్ర కార్యదర్శి సంజయ్ మిత్ర అప్పట్లో లేఖ రాశారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2016 మే 24న పొన్నం ప్రభాకర్‌కు పంపిన అధికారిక లేఖను మంత్రి కార్యాలయం తాజాగా బయటపెట్టింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, తద్వారా ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల మధ్య ప్రయాణం సులభతరమైంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మార్గం సుగమమైందని మంత్రి కార్యాలయం తెలిపింది.







