టైప్-1 డయాబెటిస్ ఉన్న జ్యోత్స్న రంగీన్, సినిమా చూసేందుకు నోయిడాలోని PVR INOX థియేటర్‌కు వెళ్లారు. అయితే, ఆమె వెంట ఉన్న అత్యవసర వైద్య కిట్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ కిట్ వైద్యపరంగా అవసరమని ఆమె వివరించినప్పటికీ, మేనేజర్ అనుమతించేందుకు నిరాకరించారు.

ఈ సందర్భంగా థియేటర్ మేనేజర్ మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు ఉంటే సినిమాకు రాకూడదని ఆమెతో వాదించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే హైపోగ్లైసీమియా సమయంలో ఈ కిట్ ప్రాణరక్షణకు అవసరమని ఆమె చెప్పినా మేనేజర్ వినలేదు. ఈ వివక్షపై జ్యోత్స్న సోషల్ మీడియా వేదిక 'X'లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై PVR యాజమాన్యం స్పందిస్తూ జ్యోత్స్నకు క్షమాపణలు తెలిపింది. సెక్యూరిటీ సిబ్బంది ఆ కిట్‌ను బయటి ఆహారంగా పొరబడ్డారని, ఆ తర్వాత విషయం తెలిసి అనుమతించామని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో వైద్యపరంగా అవసరమైన ఆహారం, పానీయాలు, డయాబెటిస్ కిట్‌లను తమ థియేటర్లలోకి అనుమతిస్తామని PVR INOX స్పష్టం చేసింది.