నీట్ (NEET) స్కాం కారణంగా విద్యార్థులు మరణించిన ఘటనపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్‌ను నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల సెగ హైదరాబాద్‌కు కూడా తాకగా, తెలంగాణ లోక్ భవన్ వెలుపల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో 'ధురంధర్' ఫేం నటి అయేషా ఖాన్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఆమె తన సోదరుడు మరియు స్నేహితులతో కలిసి ముంబైలోని దాదర్ ప్రాంతానికి చేరుకోగా, అక్కడ నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వోర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు తనను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట కనిపిస్తోంది. ఈ ఘటనపై అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ, రోడ్డుపై ప్రశాంతంగా నిలబడినందుకు పోలీసులు తనను అరెస్ట్ చేశారని, భయంతో తన చేతులు వణికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.