నిర్మల్ జిల్లా థానూర్ మండలం బెంబార గ్రామం సమీపంలోని అడవుల్లో చిరుతపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మేత కోసం అడవిలోకి వెళ్లిన ఒక దూడను చిరుత చంపేసిందని స్థానికులు తెలిపారు. దీంతో పశువుల ప్రాణాలకు రక్షణ లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పశువుల కాపరులు అడవిలో పశువులను మేపుతున్నప్పుడు అడవి జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. పశువులకు మరింత ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.
ప్రమాదాలను నివారించేందుకు రైతులు, గ్రామస్తులు ఎప్పుడూ గుంపులుగానే తిరగాలని అధికారులు సూచించారు. వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు శబ్దం చేస్తూ ఉండాలని, దీనివల్ల చిరుతపులిని దారి మళ్లించే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.
చిరుతపులి కదలికలను నిరంతరం గమనిస్తూ, ట్రాక్ చేయడానికి అటవీశాఖ చర్యలు చేపట్టింది. మనుషులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.








