నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద మండలాల్లోని 40,760 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మొత్తం రూ. 476 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 15 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఈ ప్రాజెక్టు కోసం మంజీరా నదిలో అడ్డుగోడ, రెండు వైపులా కరకట్టలు, పంపుహౌస్‌లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వొడ్డెపల్లి వద్ద మొదటి స్టేజ్, పిట్లంలోని పెద్ద చెరువు వద్ద రెండో స్టేజ్ పంపింగ్ హౌస్‌లను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, కరకట్టల నిర్మాణం వల్ల తమ భూములు ముంపునకు గురవుతాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 300 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం 32 ఎకరాలు మాత్రమే సేకరించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 17 లక్షల పరిహారం ఇస్తుండగా, రైతులు రెట్టింపు పరిహారం కోరుతున్నారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు, ఫలితంగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి.
ప్రాజెక్టు పనుల నిలిపివేతపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో, తాము ఆశించిన సాగునీరు అందుతుందనే నమ్మకం లేదని చిన్నకొడప్‌గల్ రైతు శశికాంత్ పేర్కొన్నారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని హస్రాద్ అనే మరో రైతు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మత్తడి ఎత్తును తగ్గించాలా లేదా రబ్బర్ డ్యాం నిర్మించాలా అనే అంశాలపై నిపుణులతో సర్వే చేయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ కిమ్యానాయక్ తెలిపారు.








