హైదరాబాద్‌: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ మరమ్మతు విషయంలో తీవ్ర ఒత్తిడి, వేధింపులకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. మాసబ్‌ట్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన మేరకు.. చార్మినార్‌ ప్రాంతానికి చెందిన మీర్‌ సోఫియాన్‌ అలీ అలియాస్‌ ఆదిల్‌(24) నాలుగు నెలల క్రితం తన స్నేహితుడు పాషను బైక్‌ తీసుకువెళ్లాడు. అయితే బైక్‌ ఓ రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో పాషాతోపాటు ఇతని మిత్రుడు ఇషాక్‌ ఉద్దీన్‌లు మరమ్మతు చేసివ్వాలని.. లేకపోతే డబ్బులివ్వాలని ఒత్తిడి చేశారు.

తన వద్ద డబ్బు లేదని ఆదిల్‌ చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఈనెల 19న అర్థరాత్రి మాసబ్‌ట్యాంక్‌ ఫస్ట్‌లాన్సర్‌లోని మార్వా లిబర్టీ అపార్ట్‌మెంట్‌ ఏడవ అంతస్తు టెర్రస్‌పై హంజాలా పాషాతో పాటు మిత్రులు ఇషాక్‌ ఉద్దీన్, మస్తాన్‌ ఖాన్, మహ్మద్‌ నవాజ్, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ చేసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆదిల్‌ను పిలిపించారు. ఆదిల్, షారుఖ్‌ వెళ్లగా బైక్‌ రిపేరు గురించి ఒత్తిడి చేశారు.

తాను డబ్బులు చెల్లించలేనని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆదిల్‌ చెప్పినా.. నీ ప్రాణం పోయినా మాకు అనవసరం లేదు.. బైక్‌ రిపేర్‌ చేసి తీరాల్సిందే అని హెచ్చరించారు. దీంతో ఆదిల్‌ ఏడో అంతస్తునుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ ఆదిల్‌ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇదిలా ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మాసబ్‌ట్యాంక్‌ పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు.