నేపాల్‌లోని ఎగువ ప్రాంతాల్లో సంభవించిన మెరుపు వరదల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది గాయపడగా, 400 మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూకంపం కారణంగా మంచు చరియలు విరిగిపడటంతో బోటే కోసి నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. టిబెట్ నుంచి నేపాల్ సరిహద్దుల గుండా దూసుకొచ్చిన ఈ వరద నీరు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తింది. సెకండ్ల వ్యవధిలో వచ్చిన ఈ ప్రవాహానికి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో, విపత్తు నిర్వహణ దళాలైన ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున, నదికి సంబంధించిన డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటల పాటు నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సారణ్, ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.








