భారతీయ పర్యాటకులు, సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారం చేసే వారికి నేపాల్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఇప్పటివరకు కేవలం రూ.100 నోట్లను మాత్రమే అనుమతిస్తున్న నేపాల్, ఇకపై రూ.200 మరియు రూ.500 నోట్లను కూడా అధికారికంగా అంగీకరిస్తున్నట్లు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ వెల్లడించారు.
భారత్‌లో 2016 నవంబర్ 9న పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి నేపాల్ ఈ కరెన్సీపై ఆంక్షలు విధించింది. తాజా నిర్ణయంతో ఆ నిబంధనలను సడలించారు. అయితే, 2016 నవంబర్ 9కి ముందు జారీ చేసిన పాత నోట్లపై నిషేధం మాత్రం అలాగే కొనసాగుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, పర్యాటకులు లేదా వ్యాపారులు గరిష్ఠంగా రూ.25,000 వరకు విలువైన రూ.200, రూ.500 నోట్లను నేపాల్‌లోకి తీసుకెళ్లవచ్చు. భారత్ మినహా ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే భారత కరెన్సీకి మాత్రం అనుమతి లేదని అధికారులు తెలిపారు.
ఈ సడలింపుల వల్ల భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఆర్థిక లావాదేవీలు సులభతరం కానున్నాయి. దీనివల్ల పర్యాటకులు, చిన్న తరహా వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.








