నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. నేపాల్ టూరిజం బోర్డు సమాచారం ప్రకారం, గల్లంతైన వారిలో 500 మందికి పైగా విదేశీయులు ఉన్నారు; వీరిలో చాలా మంది కైలాస మానస సరోవర యాత్రకు లేదా ట్రెక్కింగ్‌కు వెళ్లిన వారే.

ఈ విపత్తు భారత్‌లోని హిమాలయ రాష్ట్రాల్లో కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమనదాలు (మంచు పర్వతాలు), మంచు సరస్సులు, నిటారైన పర్వతాలు ఉన్న ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, మంచు తుఫానులు (అవలాంచ్‌లు), ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది.

జమ్మూకశ్మీర్, లద్దాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ ప్రమాదాల జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, లద్దాక్ ప్రాంతాల్లోని కొన్ని మంచు సరస్సులు అత్యధిక ప్రమాదకరమైనవిగా పరిశోధనలు గుర్తించాయి.

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి, కిన్నౌర్, కులు, చంబా జిల్లాల్లో కూడా ఇలాంటి ముప్పు ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమనదాలు వేగంగా కరిగి, మంచు సరస్సుల విస్తీర్ణం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది.

ఉత్తరాఖండ్‌లోని చమోలీ, జోషిమఠ్, గర్వాల్ ప్రాంతాలు కూడా హిమాలయ విపత్తులకు అత్యంత సున్నితమైనవి. 2021లో చమోలీలో జరిగిన భారీ వరదలో మంచు, రాళ్లు, మట్టి కొట్టుకురావడంతో అక్కడి జలవిద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, ఈ ముప్పు నేపాల్‌తో పాటు భారత్‌కు కూడా ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. హిమాలయాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టం పెరగడం వంటి పర్యావరణ మార్పులు భారత్, నేపాల్‌లను ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు.